పర్యావరణాన్ని కాపాడుకోకుంటే ప్రమాదమే..శాసనమండలి చైర్మన్   గుత్తా సుఖేందర్ రెడ్డి

పర్యావరణాన్ని కాపాడుకోకుంటే ప్రమాదమే..శాసనమండలి చైర్మన్   గుత్తా సుఖేందర్ రెడ్డి

 ఆమనగల్లు, వెలుగు: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కడ్తాల్  మండలం హనుమాస్ పల్లి ఎర్త్  సెంటర్ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న విత్తన పండుగ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పాత వ్యవసాయ పద్ధతులను పాటిస్తే భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. పశు సంపదను కాపాడుకోవాలని, లేకపోతే రాబోయే ఐదేళ్లలో భూమి, వ్యవసాయం దక్కకుండా పోతుందని  హెచ్చరించారు.

మానవాళి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్  దిలీప్ రెడ్డి, జాతీయ జీవ వైవిధ్య సంస్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి, సీజీఆర్  అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.